‘పేపర్.. పేపర్’ అంటూ హాకర్ కేకలేస్తుంటే.. జనం కళ్లు నులుముకుంటూ నిద్రలేచారు. మధ్యాహ్నానికి కానీ రాని పత్రిక.. పొద్దున్నే పలకరించడమేమిటని ఆశ్చర్యపోయారు. కొత్తగా వచ్చిందని తెలియగానే ఉత్సుకతతో కొన్నారు. ఆసక్తితో చదివారు. స్వచ్ఛందంగా చందాలు కట్టారు. ఆనాడు విశాఖ ప్రజలు మక్కువతో అక్కున చేర్చుకున్న ఈనాడు.. ఐదు దశాబ్దాల్లో మహావృక్షంగా ఎదిగింది.
Published : 03 Aug 2024 22:57 IST
‘పేపర్.. పేపర్’ అంటూ హాకర్ కేకలేస్తుంటే.. జనం కళ్లు నులుముకుంటూ నిద్రలేచారు. మధ్యాహ్నానికి కానీ రాని పత్రిక.. పొద్దున్నే పలకరించడమేమిటని ఆశ్చర్యపోయారు. కొత్తగా వచ్చిందని తెలియగానే ఉత్సుకతతో కొన్నారు. ఆసక్తితో చదివారు. స్వచ్ఛందంగా చందాలు కట్టారు. ఆనాడు విశాఖ ప్రజలు మక్కువతో అక్కున చేర్చుకున్న ఈనాడు.. ఐదు దశాబ్దాల్లో మహావృక్షంగా ఎదిగింది.
తెలుగు ప్రజలు భాషాభిమానులు. చదువరులు. జిజ్ఞాసులు. అక్షరాన్ని అభిమానిస్తారు. వాక్యాన్ని ప్రేమిస్తారు. మంచి కథనాలకు కదిలిపోతారు. ఆ ఉత్తమాభిరుచి కలిగిన పాఠకుల్లో రామోజీరావు కూడా ఒకరు. ఏ పత్రికా ఆయన అంచనాలకు తగినట్టు ఉండేది కాదు. వార్తా రచనలో అనేక లోపాలు కనిపించేవి. ప్రాధాన్యాలు జనాభిప్రాయానికి దూరంగా ఉండేవి. పత్రికల నిర్వహణలోనూ ఎన్నో వైఫల్యాలు. సాంకేతికతా అంతంతమాత్రమే. ఆ పరిమితులను దాటుకుని, లోపాలను అధిగమించుకుని ఓ కొత్త దినపత్రికను తీసుకురావాలనే బలమైన సంకల్పం ఆయనను స్థిమితంగా ఉండనీయలేదు. అలా అని ఆయనేం, వ్యాపార కుటుంబంలో పుట్టలేదు. అచ్చమైన రైతు బిడ్డ. 1936 నవంబరు 16న కృష్ణాజిల్లాలోని పెదపారుపూడిలో జన్మించారు. బీఎస్సీ చదివారు. కొంతకాలం దిల్లీలోని ఓ యాడ్ ఏజెన్సీలో ఉద్యోగం చేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌తో తన వ్యాపార ప్రస్థానం ప్రారంభించారు. కిరణ్ యాడ్స్‌తో ప్రకటనల రంగంలోకి వచ్చారు. అన్నదాత వ్యవసాయ మాస పత్రిక స్థాపన ద్వారా అక్షరానుబంధం ఏర్పడింది. విశాఖ కేంద్రంగా ‘ఈనాడు’ను ప్రారంభించడంతో అది మరింత బలపడింది. ప్రత్యేకించి విశాఖనే ఎంచుకోవడం వెనుక ఓ వ్యూహం ఉంది. అప్పటి వరకూ ప్రధాన పత్రికా కార్యాలయాలన్నీ విజయవాడలోనే ఉండేవి. దీంతో ఉషోదయానికంతా తలుపుతట్టాల్సిన పేపరు.. ఏ మధ్యాహ్నానికో వైజాగ్ ప్రజల ఇంటికొచ్చేది. అదీ చల్లారిపోయిన వార్తలతో. దీంతో, విశాఖ ప్రయోగాలకు తిరుగులేని వేదికలా కనిపించింది. అక్కడి నుంచే తన ప్రయత్నాన్ని ప్రారంభించారు రామోజీరావు. పాత ముద్రణ యంత్రాలు తెప్పించారు. సీతమ్మధార ప్రాంతంలో మూలనపడిన గోడౌన్‌ను కార్యాలయంగా మార్చుకున్నారు. మూస ధోరణిని తోసిరాజని దినపత్రికకు ‘ఈనాడు’ అని నామకరణం చేశారు. ఆయన జర్నలిజం చదవలేదు. కానీ జనాన్ని చదివారు. ప్రజల నాడిని అర్థం చేసుకున్నారు. పాఠకాసక్తికి పెద్దపీట వేశారు. వాడుక మాటల్నే పత్రికా భాషగా ఎంచుకున్నారు. ‘ఈనాడులో వచ్చే ప్రతి వార్తకూ ప్రజోపయోగమే గీటురాయిగా ఉండాలి’ అంటూ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఆగస్టు 10, 1974న తొలి సంచిక మార్కెట్‌లోకి వచ్చింది.
సరికొత్తగా..
ఈనాడు పఠనం పాఠకులకు సరికొత్త అనుభవం. ‘రైతేరాజు’ రైతును రారాజును చేసింది. సేద్యానికి అక్షర నైవేద్యం సమర్పించింది. డెయిలీ సీరియల్స్ మహిళా పాఠకుల కాలక్షేపానికి పనికొచ్చాయి. సైన్సు వార్తలు.. కొత్త తరానికి భలేగా నచ్చేశాయి. నలుగురూ కలుసుకున్నప్పుడు ఆ విషయాలే చర్చించుకునేవారు. వాదించు కునేవారు. మరోవైపు ప్రచారాన్నీ హోరెత్తించారు. గోడలు, బస్సులు, అగ్గిపెట్టెలు.. ఎటూ చూసినా ఈనాడు పేరే! ‘మా ఇంటికి ఈనాడు వస్తుంది’ అని చెప్పుకోవడం ఉత్తమాభిరుచికి నిదర్శనంగా మారింది. తెలుగువాళ్లు పత్రికలు చదవరనీ, చదివినా కొని చదవరనీ ఓ అపప్రధ ఉండేది. ఈనాడు ఆ అభాండాన్ని బద్దలుకొట్టింది. తొలిరోజే నాలుగున్నర వేల కాపీలతో మార్కెట్‌లో ప్రవేశించింది. ఆ వేలు లక్షలు కావడానికి ఎంతో సమయం పట్టలేదు. మార్కెటింగ్‌లోనూ వినూత్నమైన వ్యూహాలు అమలు చేశారు. అడిగినవారికంతా ఉచితంగా పేపర్లు వేశారు. అలా పత్రికా పఠనానికి అలవాటు పడినవాళ్లంతా త్వరలోనే చందాదారులుగా మారారు. బంధుమిత్రులతోనూ చందాలు కట్టించారు.
ప్రకటనల రంగంలోనూ..
పత్రికను నడపడమంటే.. నోట్లు చల్లి, చిల్లర ఏరుకోవడమే - అని గేలిచేసే రోజులవి. ఏ పత్రికా సర్క్యులేషన్ మీద మాత్రమే ఆధారపడి బతకలేదు. వాణిజ్య ప్రకటనలే పోషకాహారం.
అప్పటి వరకూ ఆ విభాగాన్ని పెద్దగా పట్టించుకున్నవారూ లేరు. నోటికొచ్చినంత అడిగేయడం,ఇచ్చినంత తీసుకోవడం.. తప్పించి ఓ కచ్చితమైన టారిఫ్ ఉండేది కాదు. ఉన్నా పేరుకే. అలాంటి వాతావరణాన్ని ఈనాడు వ్యవస్థీకృతం చేసింది. ఫలితంగా పత్రిక రాబడి పెరిగింది. వ్యాపార వర్గాలు కూడా చందాదారుల జాబితాలో చేరిపోయాయి. నాణ్యత కోసం, నవ్యత కోసం నిబద్ధతతో ఈనాడు వేసిన ప్రతి అడుగూ.. దేశంలోని ప్రాంతీయ పత్రికలకు గెలుపుదారి చూపించింది. తెలుగు పత్రికారంగంలో అయితే.. మినీల నుంచి ప్రత్యేక అనుబంధాల వరకూ.. అన్నింటా అడుగుజాడ ఈనాడుదే.
మార్పు తీర్పు..
భాష, ఇతివృత్తం, ముద్రణ.. ఇలా అన్ని కోణాల్లోనూ తన పత్రిక కొత్తగా ఉండాలని రామోజీరావు కోరిక. మాస్ట్‌హెడ్ నుంచి ఫాంట్ వరకూ, పత్రాలంకరణ నుంచి ఫొటోల ప్రచురణ వరకూ.. ప్రతి అంశాన్నీ దృష్టిలో పెట్టుకున్నారు. ముఖ్యంగా తెలుగు ఫాంట్ మరీ నాసిరకంగా ఉండేది. కొమ్ము లైతే.. కొమ్ములొచ్చినట్టు ఎబ్బెట్టుగా కనిపించేవి. దీర్ఘాలు నిజంగానే దీర్ఘాలు తీసేవి. ఒత్తులు కత్తుల్లా పొడుచుకొచ్చేవి. దీనివల్ల పాఠకుడు అసహనానికి గురయ్యేవాడు. కంటికి శ్రమ కలిగేది. పరిపూర్ణతావాది అయిన రామోజీరావుకు ఆ లోపాలు చికాకు కలిగించాయి. ఈనాడు కోసమే ప్రత్యేకంగా ఫాంట్లు డిజైన్ చేయించారు. కాబట్టే, ఈనాడు చదువుతున్నప్పుడు పాఠకుడు.. అక్షరాలతో సంభాషిస్తున్న అనుభూతిని పొందుతాడు. ఆ మమకారంతోనే గుండెల్లో పెట్టుకున్నాడు. అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దినపత్రికగా సర్వోన్నత పీఠంపై కూర్చోబెట్టాడు. ఐదు దశాబ్దాలుగా ఆ ఘనతను నిలబెడుతూనే ఉన్నాడు.
తొలి సంచిక..
ఈనాడు తొలి సంచికే ఓ సంచలనం. ఆ ప్రాధాన్యాలు సరికొత్త ప్రమాణాలు. అమెరికా పరిణామాలకు అగ్రాసనం వేస్తూ.. ‘ఎట్టకేలకు నిక్సన్ నిష్క్రమణ’ శీర్షికతో ప్రధాన కథనాన్ని ప్రచురించింది. వాటర్‌గేట్ కుంభకోణం తదనంతర పరిణామాల్ని ప్రస్తావించింది. కొత్త అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్ జీవితాన్ని సంక్షిప్తంగా పరిచయం చేసింది. ‘నిక్సన్ భవితవ్యం’ ఎలా ఉండబోతున్నదీ విశ్లేషించింది. మొత్తంగా, అగ్రరాజ్యంలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని కళ్లకు కట్టినట్టు వివరించింది. ఆ వ్యవహారాలకు మరో అగ్రరాజ్యమైన రష్యా ఎలా స్పందించిందనే అదనపు సమాచారాన్నీ జోడించింది. కెనడా క్యాబినెట్‌లో మార్పులకు కూడా ఓ సింగిల్ కాలమ్ కేటాయించింది. సీజనల్ కార్మికుల చేదు బతుకులను మరో పతాక శీర్షికగా ఎంచుకోవడం ద్వారా స్థానిక కథనాలకు పెద్దపీట వేస్తామని పాఠకలోకానికి సందేశం పంపింది ఈనాడు. సహకార రంగంలోని చక్కెర కర్మాగారాల్లో ఒకటైన ఆముదాల వలస ఫ్యాక్టరీలో నెలకొన్న పరిస్థితుల్ని సమగ్రంగా వివరించింది. తూర్పు గోదావరి జిల్లాలో కిరాణా దుకాణాల దుస్థితికి అద్దంపట్టే కథనం మరొకటి. కల్తీ నిరోధక చట్టం అమలు విషయంలో సర్కారు వైఖరికి నిరసనగా జిల్లా వర్తక సంఘం తీసుకున్న నిర్ణయానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా.. తాను సామాన్యుల పక్షమని తొలిరోజే నిరూపించుకుంది. వరద గోదావరి ప్రభావాన్నీ ఓ సింగిల్ కాలమ్‌లో అక్షరీకరించింది. ‘కొసమెరుపు’ నిజంగా కొసమెరుపే! ‘రూపాయి విలువ 20 పైసలట. లెక్కగట్టి మరీ రూపాయికి ఈ తోటకూర కొమ్మ ఇచ్చింది కూరలమ్మ’ అంటూ ఓ భర్త భార్యతో వాపోతున్న పాకెట్ కార్టూన్ .. అలనాటి మధ్యతరగతి జీవితానికి అద్దం పట్టింది. తొలి సంచికలోనే, అదీ మొదటి పేజీలోనే ప్రకటనలకు చోటిచ్చి పత్రిక మనుగడలో వాణిజ్య ప్రకటనల పాత్రను చెప్పకనే చెప్పింది ఈనాడు. ‘వార్తలో పుట్టి, వార్తలో పెరుగుతుంది పత్రిక. తాను స్పందిస్తుంది. ప్రజలను స్పందింపజేస్తుంది. ఈనాడు జన ప్రవేశం కూడా అందుకే’ అంటూ ప్రారంభ సంచిక సంపాదకీయంలోనే స్పష్టం చేశారు రామోజీరావు. యాభైఏళ్లుగా ఈనాడు మాట అదే, బాట అదే!
దినపత్రికలు.. ఈనాడుకు ముందూ ఉన్నాయి.
తర్వాతా వచ్చాయి.
పత్రికా పఠనాన్ని ఓ పాజిటివ్ వ్యసనంగా మార్చింది మాత్రం..
ఈనాటి వరకూ ఈనాడే!